హైదరాబాద్: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని  బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మరో వైపు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రేపు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్దం చేయనుంది.అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్ధులకు రెండు రోజుల పాటు సెలవులను  పొడిగించే యోచనలో ఉంది.

తమ డిమాండ్లను పరిష్కరించాలనే డిమాండ్ తో  ఆర్టీసీ జేఎసీ ఆథ్వర్యంలో కార్మికులు  ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె కారణంగా ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ప్రైవేట్ స్కూల్ బస్సులు,  ప్రైవేట్ బస్సులను నడుపుతున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెను పురస్కరించుకొని  సీఎం కేసీఆర్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ బుధవారం నాడు  ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో రానున్న రెండు రోజుల్లో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై సునీల్ శర్మ అధికారులతో చర్చించారు.

దసరా పర్వదినం ముగిసినందున  హైద్రాబాద్ తో పాటు ఆయా జిల్లా కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం నుండి రెండు రోజుల పాటు కనీసం రెండు కోట్ల మంది ప్రయాణం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తోంది.

ప్రస్తుతం ఐదువేల బస్సులను నడుపుతున్నారు. మరో రెండు వేల ప్రైవేట్ బస్సులను నడపాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రైవేట్ బస్సులకు నాలుగైదు రోజుల పాటు  పర్మిట్లు ఇచ్చి బస్సులను నడిపించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

సోమవారం నుండి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.ఒకటి రెండు రోజుల పాటు దసరా సెలవులను పొడిగిస్తే ఎలా ఉంటుందనే యోచనలో సర్కార్ ఉంది. మరో వైపు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై  కోర్టు ఏ రకమైన తీర్పును వెలువరించనుందోననే ఆసక్తి నెలకొంది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.