తెలంగాణ గిగ్ వర్కర్స్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. 'గిగ్ వర్కర్స్ బిల్లు'పై సంతకం చేసినందుకు గవర్నర్ కు వాళ్లు ధన్యవాదాలు తెెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ కూడా TGPWU సభ్యులను అభినందించారు.

Hyderabad : తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ఇవాళ(సోమవారం) తెలంగాణ గవర్నర్ ను కలిశారు. TGPWU రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ నాయకత్వంలో గిగ్ కార్మికుల ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గిగ్ కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం ఉద్దేశించిన 'గిగ్ వర్కర్స్ బిల్లు'పై సంతకం చేసి, తమకు అండగా నిలిచినందుకు యూనియన్ ప్రతినిధులు గవర్నర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మందికి పైగా గిగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి సామాజిక భద్రత కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) చేస్తోన్న నిరంతర పోరాటాన్ని గవర్నర్ అభినందించారు. కార్మికుల హక్కుల కోసం యూనియన్ పడుతున్న శ్రమను ఆయన కొనియాడారు.

ఈ భేటీలో యూనియన్ నాయకులు గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు తమ పూర్తి సపోర్ట్ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో TGPWU నాయకులు, పెద్ద సంఖ్యలో గిగ్ కార్మికులు పాల్గొన్నారు.