గుజరాత్ రాష్ట్రం సూరత్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ దేవాదాయ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన దేవాదాయ శాఖ ఉద్యోగులు కొందరు గుజరాత్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో వారు సూరత్ సమీపంలో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఉద్యోగులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుప్రమాదానికి గురవడంతో డిక్ మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్,  పాన్ బజార్ వేణుగోపాల స్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రమణ మృతిచెందారు.

ఇక ఈ ప్రమాదంలో మరికొందరు దేవాదాయ శాఖ ఉద్యోగులు గాయాలపాలయ్యారు. ఈవో సత్యనారాయణ, పూజారి వేంకటేశ్వర శర్మ,  క్లర్క్ కేశవరెడ్డికి తీవ్ర గాయాలపాలవగా అహ్మదాబాద్  పట్టణంలోని హోప్ హాస్పిటల్ కు తరలించారు. 

ఈ ప్రమాదంపై తెలుసుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను ఆదేశించారు.