హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణపై సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. 
 
షెడ్యూల్ లోపే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 10న డ్రాఫ్ట్ సిద్ధమవుతోందని తెలిపారు. 12వ తేదీ లోపు పార్టీలు, ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరిస్తామన్నారు. 

నోటిఫికేషన్ కు 15 రోజుల ముందు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఈనెల 14న రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్నారు. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు వారికే కేటాయిస్తామన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో 50 లక్షల మందిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఒక్కోపోలింగ్ బూత్ లో 800మంది ఓటర్లు ఓటు వేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.  

ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తప్పుబట్టాం. అభ్యంతరాల తేదీని మార్చాలని సూచించినట్లు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

మరోవైపు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ కారాదని కాంగ్రెస్ నేత నిరంజన్ సూచించారు. ఎన్నికలకు 6 మాసాలు సమయం ఉండేలా చూడాలని కోరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి తెలిపారు. డీ లిమిటేషన్ రిజర్వేషన్ల ఖరారు తర్వాత గడువు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 

మరోవైపు ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ఆహ్వానిస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ఈనెల 30 లోగా నిర్వహించాలని కోరినట్లు చెప్పుకొచ్చారు.