వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నాలుగు పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది.
హైదరాబాద్: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నాలుగు పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికలకు కీలకమైన వార్డుల,డివిజన్ల పునర్విభజన డీలిమిటేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలకశాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. రెండు కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది మార్చి 15తో ముగియనుంది. దీంతో ఆ లోపే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పాలకవర్గాల గడువు మార్చి 15తో ముగియనుండగా సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 16వ తేదీ వరకూ ఉంది.
నకిరేకల్ గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ఈ నెల 15న పూర్తి కాగా పురపాలక సంఘంగా మారింది. కొత్తూరు కొత్త పురపాలక సంఘంగా ఏర్పాటైంది. వీటన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసి మార్చి లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకువచ్చిన కొత్త పురపాలక చట్టం మేరకు వార్డుల/డివిజన్ల సంఖ్య పెరిగింది. గత పురపాలక ఎన్నికల్లో ఈ విభజనపైనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాటు హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో విభజన విషయంలో చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ( జనవరి 15వ తేదీ ప్రచురించే ఓటర్ల తుదిజాబితానే పురపాలక ఎన్నికలకు ప్రాతిపదిక అవుతుంది. జనవరి 15లోపు వార్డుల పునర్విభజన పూర్తయితే ఆ మేరకు ఓటర్ల జాబితాలను ఖరారు చేస్తారు.
తాజా ఎన్నికలకు సంబంధించి మేయర్, ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఈ ఏడాది జనవరిలో జరిగిన పుర ఎన్నికల నేపథ్యంలో ఖరారు చేశారు. వరంగల్ మేయర్ పదవి బీసీకి, ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు, సిద్దిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ జనరల్ మహిళకు, అచ్చంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ జనరల్‌కు రిజర్వు అయ్యింది.
వరంగల్ లో ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్య 58. వార్డుల పునర్విభజనతో ఈ సంఖ్య 66కి పెరిగే అవకాశం ఉంది. ఖమ్మంలో ప్రస్తుతం 50 వార్డులున్నాయి. పునర్విభజనతో 60కి వార్డులు పెరగనున్నాయి.
సిద్దిపేటలోని వార్డులు 34 నుండి 43కి పెరుగుతాయి. అచ్చంపేటలో ప్రస్తుతం 20 ఉన్నాయి. పునర్విభజన తర్వాత కూడ వాటి సంఖ్యలో మార్పు ఉండదు. నకిరేకల్ లో కూడ ప్రస్తుతం 20 వార్డులున్నాయి. వాటి సంఖ్యలో మార్పు ఉండదు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 29, 2020, 11:09 AM IST