Asianet News TeluguAsianet News Telugu

కరోనా తగ్గింది.. స్కూళ్ల ప్రారంభానికి ఇదే సమయం, తల్లిదండ్రులను ఒత్తిడి చేయం: సబితా ఇంద్రారెడ్డి

విద్యార్థులను బడికి పంపించాలని బలవంతం చేయమని.. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను నెలవారీగా తీసుకోవాలని పాఠశాల యాజమాన్యాలను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. 

telangana education minister sabitha indra reddy comments on schools re open
Author
Hyderabad, First Published Aug 28, 2021, 4:45 PM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులో ఉన్నందున విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మహబూబియా ప్రభుత్వ పాఠశాలలను శనివారం మంత్రి తనిఖీ చేసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ బోధనతో పూర్తిస్థాయి ప్రయోజనాలు నెరవేరడం లేదని.. అందుకే ప్రత్యక్ష బోధన కొనసాగుతుందన్నారు.

ఇంట్లో మాదిరిగానే విద్యాసంస్థల్లోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులను బడికి పంపించాలని బలవంతం చేయమని.. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సబిత చెప్పారు. విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను నెలవారీగా తీసుకోవాలని పాఠశాల యాజమాన్యాలను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా యాజమాన్యాలు మానవీయంగా వ్యవహరించాలని ఆమె కోరారు.

18 ఏళ్లు నిండిన విద్యార్థులకు వ్యాక్సిన్లు వేయించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. విద్యా వాలంటీర్లు, పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్ల నియామకంపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని సబితా  ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇంటర్‌ రెండో సంవత్సరం చదివే విద్యార్థులకు ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరీక్షలు లేకుండానే పాస్‌ చేస్తే ఉద్యోగాలు పొందేటప్పుడు ఇబ్బందులు వస్తాయని సబిత వివరించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios