హైదరాబాద్: జూలై 5 నుండి 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి  శనివారం నాడు ప్రకటించింది. 

ఈ నెల 18వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టుగా విద్యామండలి తెలిపింది. జూలై  5, 6 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 7,8,9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. 

ఈ నెల 20వ తేదీ నుండి మే  18వ తేదీ వరకు ఎంసెట్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్ 28 వరకు ఆలస్య రుసుముతో ధరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు గంటల పాటు పరీక్షను నిర్వహిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వందశాతం, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నే ఎంసెట్ లో ఇవ్వాలని ఇప్పటికే కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది కూడ జేఎన్‌టీయూ హెచ్ రెక్టార్ గోవర్దన్ పరీక్షల కన్వీనర్ గా వ్యవహరిస్తారు.