న్యూఢిల్లీ: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై  కోర్టు ధిక్కరణ పిటిషన్ ను తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  మంగళవారం నాడు ఎన్జీటీ విచారణ సాగించింది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కొనసాగించవద్దని  ఎన్టీజీ ఆదేశాలు జారీ చేసినా కూడ ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై మంగళవారం నాడు ఎన్జీటీ చెన్నై బ్రాంచ్ విచారణ ప్రారంభించింది.  ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టవద్దని  ఎన్జీటీ మరోసారి స్పష్టం చేసింది. పనులు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసినా కూడ పనులు నిర్వహిస్తున్నారని పిటిషనర్ చేస్తున్న అభ్యంతరాలపై కృష్ణా బోర్డును ఎన్జీటీ ఆదేశించింది.

ఈ వ్యవహారంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని తెలంగాణ తరపు న్యాయవాది  కోరారు. నిజనిర్ధారణ కమిటీ వేయాలని తెలంగాణ వినతిపై కూడ వివరణ ఇవ్వాలని కృష్ణా బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఈ పిటిషన్ పై ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.