కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు నెలలుగా తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

తుది సెమిస్టర్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని వర్సిటీలకు సూచించింది. డిగ్రీ, పీజీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధులకు జూన్ 20 నుంచి పరీక్షలు నిర్వహించవచ్చని వర్సిటీలకు ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది.

మిగిలిన సెమిస్టర్లకు నవంబర్, లేదా డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అలాగే  పరీక్షా సమయాన్ని రెండు గంటలకు కుదించాలని.. ప్రశ్నాపత్రంలోనూ ఎక్కువ ఐచ్ఛికాలను ఇవ్వాలని వెల్లడించింది.

అన్ని సెమిస్టర్ విద్యార్ధులకు పరీక్షలు లేకుండానే తాత్కాలికంగా ప్రమోట్ చేయాలని ఉన్నత విద్యామండలి సూచించింది. ప్రాజెక్ట్‌లు, సెమినార్లు, వైవాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.