కరోనా వైరస్ కష్టకాలంలో బయటకు వెళ్ళడానికే అందరూ భయపడుతున్నారు. సాధారణంగా బయటకు వెళ్ళడానికే భయపడుతున్న వేళ ఆసుపత్రులంటే ఇంకేమన్నా ఉందా.... ఆ ధైర్యం కూడా ఎవ్వరూ చేయడంలేదు. 

ఇలాంటి తరుణంలో ఒక కానిస్టేబుల్, అతని భార్య చేసిన ఒక మంచి పని ఏకంగా డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, వారిని సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుని అభినందించాడు. 

వివరాల్లోకి వెళితే సిద్ధిపేట జిల్లా రాయిపోలు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శేఖర్ కి ఆసుపత్రిలో అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం కావాలన్న సమాచారం అందింది. సమయం వృధా చేయకుండా ఇంటికి వెళ్ళాడు. 

తమ భార్య రేఖది కూడా అదే బ్లడ్ గ్రూప్ అవడంతో ఆమెను తీసుకొని ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేయించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారు సోషల్ మీడియాలో వారిని మెచ్చుకున్నారు. 

"ఈ కరోనా పై పోరులో తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని  పాటించడమే  సమాజానికి ఒక వ్యక్తి చేస్తున్న అతిపెద్ద మేలు. కానీ ఈ పోలీసు కుటుంబం మాత్రం ఎమర్జెన్సీ ఫస్ట్ అంటూ పోలీసుల ఔన్నత్యాన్ని చాటారు. కష్టమైనా నిర్ణయాలను తీసుకునేందుకు పోలీసులు ఎంత కష్టాన్నైనా భరిస్తారు" అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.