బీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాలు తిప్పికొట్టాలి: రేవంత్ రెడ్డి
భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా హైద్రాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారంనాడు హైద్రాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. హైద్రాబాద్ నగరంలోని సోమాజీగూడ నుండి నెక్లెస్ రోడ్డు వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు.నెక్లెస్ రోడ్డు వద్ద ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించింది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ సభకు అనుమతివ్వకపోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ వినతిని తిరస్కరించి బీజేపీ సభకు పరేడ్ గ్రౌండ్స్ కు అనుమతిచ్చారన్నారు.ఈ నెల 17న జరిగే సోనియా గాంధీ సభకు భారీగా తరలి రావాలన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే ప్రసంగించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించారని మాణిక్ రావు ఠాక్రే గుర్తు చేశారు.తెలంగాణకు బీజేపీ, బీఆర్ఎస్ అవసరం లేదన్నారు. ఈ రెండు పార్టీలు అధికారంలోకి రాకుండా ఉండాలంటే మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఠాక్రే ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.