తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరవులతారని ఎవరినైనా అడిగితే టక్కున కేసీఆర్ అని చెప్పేస్తారు. అయితే మరి కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరని అడిగితే చాలా పేర్లు వినిపిస్తాయి. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు తమ ప్రచార కార్యక్రమాల్లో ప్రస్తావిస్తూ కాంగ్రెస్ (మహాకూటమి)ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించిన  సందర్భాలు అనేకం వున్నాయి. అయితే ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు. 

శనివారం బండ్ల గణేష్, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ రెడ్డితో కలిసి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతడు ఉత్తమ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా, టిపిసిసి అధ్యక్షుడిగా వున్న ఉత్తమే తదుపరి తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ పేర్కొన్నాడు. అలాంటి నాయకుడు మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు కాబట్టి అతన్ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు బండ్ల గణేష్ పిలుపునిచ్చాడు. 

అంతేకాకుండా బండ్ల గణేష్ సీఎం కేసీఆర్ కుటుంబంపై కూడా విరుచుకుపడ్డాడు. తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా సోనియా గాంధి ఇక్కడి ప్రజల ఆంకాంక్షను నెరవేరిస్తే... ఆ త్యాగాన్ని తన ఖాతాలో వేసుకుని కేసీఆర్ అధికారంలోకి వచ్చాడన్నారు. ఈ అధికారాన్ని అడ్డంవ పెట్టుకుని నాలుగున్నరేళ్లు కేసీఆర్ కుటుంబం మోసం చేసిందని విమర్శించాడు. ఇకనైనా తెలంగాణ ప్రజలు వారి మోసాలను గుర్తించాలని బండ్ల గణేష్ సూచించారు.