Asianet News TeluguAsianet News Telugu

టీ కాంగ్రెస్‌లో యశ్వంత్ సిన్హా టూర్ రచ్చ.. ఎయిర్‌పోర్టుకు వీహెచ్.. సీఎల్పీని తప్పుపట్టిన జగ్గారెడ్డి

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్  తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చకు కారణమైంది. ఆయనతో సమావేశమయ్యే విషయంలో టీ కాంగ్రెస్‌లో విభేదాలు వెలుగుచూశాయి.

Telangana Congress Split over Presidential candidate yashwant sinha hyderabad tour
Author
First Published Jul 2, 2022, 2:16 PM IST

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్  తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చకు కారణమైంది. ఆయనతో సమావేశమయ్యే విషయంలో టీ కాంగ్రెస్‌లో విభేదాలు వెలుగుచూశాయి. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు ఇతర ప్రతిపక్ష పార్టీలతో సహా కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు మద్దతు పలికాయి. ఈ క్రమంలోనే యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఇతర పక్షాలతో కలిసి ఆ కార్యక్రమంలో వేదిక పంచుకున్న వారు పలకరించుకున్న సందర్భం లేదు. 

అయితే తెలంగాణకు వచ్చే సరికి ఆ పరిణామాలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని తెలంగాణ బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి  ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వస్తున్న యశ్వంత్ సిన్హాకు భేటీపై టీ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే పీసీపీ మాత్రం యశ్వంత్ సిన్హాతో భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఢిల్లీ వెళ్లి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపాలని టీపీసీసీ ఆలోచన చేస్తుంది. 

పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సిన్హాకు మద్దతిస్తారని, అయితే టీఆర్‌ఎస్‌ నేతలతో ముందుగా భేటీ అవుతున్నందున హైదరాబాద్‌లో ఆయనను కలవబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ప్రకటించారు. మమతా బెనర్జీ, శరద్ పవార్ నిర్ణయించిన అభ్యర్థి సిన్హా అని.. కాంగ్రెస్ కాదని రేవంత్ రెడ్డి అన్నారు.  అయితే దీనిని పలువురు నాయకులు వ్యతిరేకించారు. కాంగ్రెస్  పార్టీ యశ్వంత్ సిన్హా బహిరంగంగా మద్దతు ఇచ్చిందని, అతను నామినేషన్ దాఖలు చేసినప్పుడు రాహుల్ గాంధీ కూడా అతనితో చేరారని ఎత్తి చూపారు.

దీంతో యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్.. టీ కాంగ్రెస్‌లో రచ్చకు కారణమైంది. నేడు హైదరాబాద్‌కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యశ్వంత్ సిన్హాను కలవొద్దని పీసీసీ చీఫ్ ప్రకటించారని చెప్పారు. యశ్వంత్ సిన్హాను సీఎల్పీకి ఆహ్వానించాల్సి ఉండాల్సిందనని అన్నారు. ఇందుకోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. అధిష్టానంతో మాట్లాడాల్సి ఉందన్నారు. భట్టి విక్రమార్క ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 

కాంగ్రెస్, సీఎల్పీ తరపున యశ్వంత్‌ సిన్హాను ఆహ్వానించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు అందుబాటులో లేని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హా  అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఈ పరిణామాలతో టీ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.

Follow Us:
Download App:
  • android
  • ios