ప్రతిపక్షాన్ని చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని కాంగ్రెస్ నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి.. టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడాన్ని నిరాకరిస్తూ... శనివారం కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యగ్రహాం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షం ఉండొద్దని కేసీఆర్‌ కోరుకుంటున్నారని వీహెచ్ ఆరోపించారు.
 
కేసీఆర్‌ ప్రజాస్వామ్యానికే వెన్నుపోటు పొడిచాడన్నారు. ప్రతిపక్షాన్ని చూసి కేసీఆర్‌ భయపడుతున్నాడని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటర్లను మోసం చేస్తున్నారన్నారు. ప్రజలు తిరగబడి తన్నే రోజు వస్తుందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌.. దళిత ప్రతిపక్ష నేతను కూడా లేకుండా చేస్తున్నాడని వీహెచ్‌ విమర్శించారు. సోనియాని సైతం కేసీఆర్‌ మోసం చేశాడన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. 

అనంతరం కుంతియా మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ అక్రమంగా తమ ఎమ్మెల్యేలను చేర్చుకుందని విమర్శించారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి పార్టీ వీడారనడం అబద్ధమన్నారు.అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గవర్నర్‌ను కలిసినా సరైన స్పందన లేదని కుంతియా పేర్కొన్నారు. కోర్టుకు వెళ్తే కేసు ఈనెల 11కు వాయిదా పడిందన్నారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కుంతియా విమర్శించారు.