ఇప్పటి వరకు జగన్ నుంచి నాకు ఒక్క ఫోన్ రాలేదు .. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా తప్పించి.. వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్, జగన్‌లతో తన అనుబంధంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్‌కు మధ్య గ్యాప్ వున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొత్తగా ముఖ్యమంత్రి అయితే.. పక్క రాష్ట్రాల సీఎంలు మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి అభినందిస్తారని రేవంత్ అన్నారు. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి ఎన్నో సమస్యలు పెండింగ్‌లో వున్నాయని, అలాంటిది జగన్ తనను కనీసం కలవకపోవడంలో అర్ధం ఏంటో తెలియదన్నారు. రాజకీయంగా తప్పించి.. వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనికి ఏపీ ప్రభుత్వం, వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
మరోవైపు సీఎం జగన్ సోదరి, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల శనివారం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి-ప్రియా అట్లూరికి వివాహం నిశ్చయమైందని, వారి వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని షర్మిల ఆహ్వానించారు. వీరి భేటీ తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.