రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. యశ్వంత్ సిన్హా ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ యశ్వంత్ సిన్హాకు.. సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. మరోవైపే నేడు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో ఈ పరిణమాలు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సాగుతుండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా బల ప్రదర్శన చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. 

యశ్వంత్ సిన్హా ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ యశ్వంత్ సిన్హాకు.. సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులో జలవిహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిచనున్నారు. 

యశ్వంత్ సిన్హాకు మద్దతుపై పార్టీ శాసనసభ్యులు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత తనకు మద్దతివ్వాలని కోరుతూ యశ్వంత్ సిన్హా ప్రసంగించనున్నారు. అక్కడ సభ ముగిసిన తర్వాత కేసీఆర్, టీఆర్ఎస్ నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. యశ్వంత్ సిన్హా ర్యాలీ, సభకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. 

ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి కూడా స్వాగతం పలకడం లేదు. రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి.. ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. హైదరాబాద్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీకి స్వాగతం పలకడంతో పాటు.. తిరిగి బయలుదేరే సమయంలో తలసాని వీడ్కోలు పలకనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు దూరంగా ఉండనున్న కేసీఆర్.. యశ్వంత్ సిన్హాకు స్వయంగా స్వాగతం పలకడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.