కమిషన్ల కోసం తాము ప్రాజెక్ట్‌లను రీ డిజైన్ చేశారమంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంటరిచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ఇవాళ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

విద్యుత్ సమస్యలతో సతమతమయ్యే స్థితి నుంచి ఇవాళ రాజస్థాన్‌కు కరెంట్ సరఫరా చేసే స్థాయికి వెళ్లిందని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలే జీవితమంతా కమిషనేనన్నారు. నాగార్జున సాగర్ నిర్మాణం సమయంలో కాలువ ఇల్లందు, గార్ల, బయ్యారం మీదుగా వెళ్లాలని కానీ.. ఆంధ్రా పాలకులు మోసం చేసి పాలేరు మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నీటిని తరలించారన్నారు.

కాంగ్రెస్ నేతలు నాటి నుంచి నేటి వరకు హైకమాండ్‌కు గులాం లాగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలుపుదామన్న నెహ్రూ నిర్ణయానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు అడ్డు చెప్పలేకపోయారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

పోడు రైతులకు కూడా రైతు బీమా, రైతు బంధు పథకం అందాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇల్లందు పట్టణానికి ఎంతో చరిత్ర ఉందని...సింగరేణిలో తొలిసారి బొగ్గు కనుగొన్నది ఇక్కడేనన్నారు. దేశంలో ఎంతోమంది మహానుభావులు ఉండగా.. ప్రతి పథకానికి నెహ్రు, ఇందిరా, రాజీవ్ పేర్లే ఉన్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబును నమ్మితే మళ్లీ టోపీ పెడతారని.. ఆలోచించి ఓటేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని నరేంద్రమోడీని ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చానని కానీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని చేపడుతుందని కేసీఆర్ ప్రకటించారు.