మోడీ పాలన అవినీతి కంపు అని.. అంతర్జాతీయ మీడియా కూడా ఇదే చెబుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని.. ప్రజాకోర్టులోనూ తేల్చుకుంటామని కేసీఆర్ తెలిపారు.

మోడీ పాలన అవినీతి కంపు అని.. అంతర్జాతీయ మీడియా కూడా ఇదే చెబుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని.. ప్రజాకోర్టులోనూ తేల్చుకుంటామని కేసీఆర్ తెలిపారు. రాఫెల్ కుంభకోణం బయటికి రావాలని.. అందులో దొంగలు బయటపడాలని సీఎం కోరారు. రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్‌ను ఆపేయాలంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కిషన్ రెడ్డికి ఇప్పుడు మర్యాదగా చెబుతున్నానని.. ఇకపై గట్టిగా చెప్పాల్సి వస్తుందని సీఎం వార్నింగ్ ఇచ్చారు. దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వాళ్లంతా మోడీ దోస్తులేనని కేసీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ నుంచి మోడీ వరకు అందరూ అబద్ధాలు చెబుతున్నారని సీఎం మండిపడ్డారు. క్లీన్ ఎనర్జీ కింద కేంద్రం ఇచ్చే విద్యుత్ కొనాలన్నారు. మన దగ్గర వున్న విద్యుత్ ఏం కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యాపారస్తుల కోసం రాష్ట్రాలపై భారం వేస్తారా అని ఆయన మండిపడ్డారు. 

ఎన్నాళ్లు అబద్ధాలతో నడిపిస్తారన్న ఆయన.. బీజేపీని తరిమికొట్టకపోతే దేశం నాశనమవుతందని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇదా మీ దేశ భక్తి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అంటున్నా.. బీజేపీ మస్ట్ గో అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. దమ్ముంటే తనను జైల్లో వేయాలని.. జైలంటే దొంగలకు భయమని, తమకేం భయం లేదని సీఎం స్పష్టం చేశారు. 

77 శాతం దేశ సంపద 10 శాతం మంది దగ్గరే వుందని.. ధనికులు ఇంకా ధనికులవుతున్నారని, పేదలు మరింత పేదలవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని.. వాట్సాప్ యూనివర్సిటీతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పేదలకు సబ్సిడీ ఎత్తేసి.. దొంగలకు సద్ది కట్టాలి, ఇది కేంద్రం తీరని సీఎం దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో 33 మంది బ్యాంకులను ముంచి పారిపోయారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 

పార్లమెంట్‌లో ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ ప్రభుత్వమే చెప్పిందని సీఎం తెలిపారు. ఈడీ పెడతాం, సీబీఐ పెడతాం అని బెదిరిస్తున్నారని ... ఎన్నికల్లో గెలవకపోయినా పరిపాలన చేసే సిగ్గులేని పార్టీ బీజేపీ అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ పరువు పోలేదా అని ఆయన గుర్తుచేశారు. రాఫెల్‌పై రాహుల్ మాట్లాడితే ఆయనపై ఎదురుదాడి చేశారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధానికి క్షమాపణ చెప్పడం అలవాటేనని.. ప్రధాని అయితే గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయా అని అడిగితే, ముస్లింలకు మోడీ క్షమాపణ చెప్పారని సీఎం గుర్తుచేశారు. 

క్షమాపణ రాజకీయాలు మోడీకి అలవాటేనని.. బుద్ధి వున్న ఏ ప్రధాని అయినా వేరే దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడాలన్న ఆయన.. కాలేజీల్లో చదివే యువతకు ఏం నేర్పిస్తున్నారో చూడాలని సీఎం వ్యాఖ్యానించారు. తప్పులు ఎత్తి చూపిన ప్రతి పార్టీని అర్బన్ నక్సలైట్ అంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.