కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికి[పోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది. 

భారతదేశంపై కూడా కరోనా పంజా బలంగా పడింది. ఇప్పటికే ఒకరకంగా భారతదేశమంతటా షట్ డౌన్ వాతావరణం కనబడుతుంది. కరోనా మహమ్మారి దెబ్బకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయ్యాయి. 

ప్రధాని నరేంద్ర మోడీ రేపు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ లో యావత్ తెలంగాణ పాల్గొంటుందని, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం 5 గంటలకు వచ్చి చప్పట్లు కొట్టమని కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

ఆ విషయంలో కొందరు ప్రధాని నరేంద్ర మోడీని ట్రోల్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ప్రధానిని ట్రోల్ చేయడంపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. వారిని ఇడియట్స్, వెధవలు అంటూ విరుచుకుపడ్డారు. 

ప్రధాని రేపు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టమన్నది ప్రజలు ఈ గొప్ప విషయానికి సంఘీభావం తెలిపేందుకని, ఇలా సాలిడారిటీ చూపిస్తే కరోనా పారిపోకున్నా... కరోనా కాదు  వేరే ఎంతటి మహమ్మరినైనా ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్న మెసేజ్ ని ఇవ్వడం దాని ఉద్దేశం అని అన్నారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కూడా అనేకసార్లు గంట కొట్టమని పిలుపునిచ్చానని, గంటలు లేని వారు ప్లేట్లు గంటెలతోటి కొట్టమని చెప్పానని, దాని వాళ్ళ తెలంగాణ వస్తదని కాదని, తెలంగాణ సమాజం అంతా కలిసికట్టుగా ఉందనే మెసేజ్ దీంట్లో ఉందని కేసీఆర్ అన్నారు. 

తాను కూడా రేపు సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో కాస్త బయటకొచ్చి చప్పట్లు కొడతానని అన్నారు. యావత్ తెలంగాణ ప్రజానీకానికి సాయంత్రం 5గంటలకు బయటకు వచ్చి ఎవరి గుమ్మాల వద్ద వారు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలపాటు చప్పట్లు కొట్టి లోపలి వెళ్లాలని పిలుపునిచ్చారు కేసీఆర్. 

రేపు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ మొత్తం సైరెన్ మోగే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్ అన్నారు. ఇది కష్టకాలమని, ప్రజలంతా ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలను అందించాలని కేసీఆర్ అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ రేపు ఉదయం 7  గంటల నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూ ని విధిస్తే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గా రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు పాటించాలని అన్నారు. 

ఇకపోతే ధనవంతులకు సైతం కేసీఆర్ ఒక్కరోజుపాటు పనివారు పనులకు రావాలని కోరుకోవద్దని అన్నారు. ఇది తెలంగాన సమాజ శ్రేయస్సు కోసమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.