ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

రూ.3 వేల కోట్లతో నెల్లికల్లు లిఫ్టుతోపాటు మరో 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికీ ఒకేచోట శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంట 30 నిమిషాలకు నెల్లికల్లులో సీఎం కేసీఆర్‌ నెల్లికల్‌ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే టీఆర్ఎస్ బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.

ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌ పర్సన్లు, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు.