Asianet News TeluguAsianet News Telugu

మే 7 వరకు తెలంగాణలో లాక్‌డౌన్.. సడలింపులు ఉండవు: కేసీఆర్ ప్రకటన

తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి ఎలాంటి లాక్‌డౌన్‌ మినహాయింపులు లేవన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 

telangana cm kcr press meet on lockdown relaxation
Author
Hyderabad, First Published Apr 19, 2020, 8:58 PM IST

తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి ఎలాంటి లాక్‌డౌన్‌ మినహాయింపులు లేవన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఆదివారం కొత్తగా 18 కేసులు నమోదయ్యాయని.. వీరితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 858కి చేరిందని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే 21 మంది మరణించారు. అలాగే ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ ఉంటుందని చెప్పారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 651 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 10 రోజులు పడుతోందన్నారు. వరంగల్ రూరల్, యాదాద్రి, సిద్ధిపేట, వనపర్తిలో జీరో కరోనా కేసులు నమోదయ్యాయని కేసీఆర్ ప్రకటించారు.

రాష్ట్రంలో 3.04 లక్షల పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయని, అలాగే 3.53 లక్షల ఎన్ 95 మాస్కులు ఉన్నాయని సీఎం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దేశంలో 8 రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని కేసీఆర్ హితవు పలికారు. 

కరోనా కేసుల విషయంలో మే 1 తర్వాత ఊరట కలిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మే 7 వరకు గతంలో ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయన్నారు.

పలు టీవీ ఛానెళ్లు నిర్వహించిన సర్వేలో లాక్‌డౌన్ పొడిగించాల్సిందిగా 92 శాతం మంది అభిప్రాయపడ్డారని కేసీఆర్ గుర్తుచేశారు. మే 5న మరోసారి రాష్ట్ర కేబినెట్ సమావేశమవుతుందని అప్పుడున్న పరిస్ధితులపై చర్చిస్తుందని సీఎం తెలిపారు.

కంటైన్మెంట్ ఏరియాల్లోని ప్రజలు బయటకు రావొద్దని కేసీఆర్ కోరారు. స్విగ్గీ, జొమాటో సేవలకు తెలంగాణలో అనుమతి లేదన్నారు. ఏ ప్రాంతాల నుంచైనా మే 7 వరకు తెలంగాణకు రావొద్దని.. ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండవని సూచించారు. పండుగలు, ప్రార్థనలు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇళ్లలోనే  చేసుకోవాలని అన్ని మతాల వారీకీ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 

కంటైన్మెంట్ ఏరియాల్లో డీజీపీ పర్యటించి పరిస్థితిని ప్రజలకు తెలియజేశారని ముఖ్యమంత్రి తెలిపారు. 15 రోజుల పాటు బయట దొరికే ఆహారాన్ని తినవద్దని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు కొనసాగుతాయని, పోలీసులకు పదిశాతం అదనపు వేతన ప్రోత్సాహకాలు ఉంటాయని సీఎం ప్రకటించారు. అలాగే విద్యుత్ ఉద్యోగులకు పూర్తి వేతనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.

3 నెలల పాటు ఇంటి అద్దెలు వసూలు చేయకూడదని.. ఇంటి ఓనర్లు ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయాలని కేసీఆర్ కోరారు. విపత్కర పరిస్ధితుల్లో 3 నెలల పాటు ఓనర్లు ఇంటి అద్దెల వసూలు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మూడు నెలలు అద్దెను వడ్డీ లేకుండా తర్వాత వాయిదాల వారీగా చెల్లించవచ్చని సీఎం తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios