విదేశాల నుంచి వచ్చే వారి ముప్పు ఆదివారంతో తొలగిపోతున్నందున స్థానికంగా వ్యాప్తి చెందకుండా చూసే బాధ్యత తెలంగాణ సమాజానిదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. 31 మార్చి వరకు తెలంగాణ ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని సీఎం తెలిపారు.

మార్చి 31 వరకు రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉంటుదని.. ఐదుగురికి మించి ఎవ్వరూ గుమిగూడరాదని కేసీఆర్ తెలిపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పటికీ మూడు ఫిట్ల దూరం పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు. కూరగాయలు, పాలు, మందులు వంటి అత్యవసర వస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒకరిని మాత్రమే బయటకు అనుమతిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు

జనతా కర్ఫ్యూ పట్ల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో పాటు వైద్య సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు చరిచి వారి పట్ల అభిమానాన్ని చాటుకున్నారని సీఎం ప్రశంసించారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాల్లో లాక్ డౌన్ కు కేంద్రం ఆదేశాలు

తెలంగాణలో ఆదివారం మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయిన కేసీఆర్ వెల్లడించారు. వీరిలో ఇద్దరు లండన్, ఇద్దరు దుబాయ్, ఒకరు స్కాట్‌లాండ్ నుంచి భారత్‌కు వచ్చారని వీరితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 26కు చేరిందన్నారు.

దేశానికి బయటి నుంచి వచ్చే వ్యక్తుల ప్రవేశం ఆదివారంతో నిలిచిపోతోందని కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోర్టులు, విమానాశ్రయాలు ఇప్పటికీ మూసివేశారని చెప్పారు. 

రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల కోసం నెల రోజులకు సరిపడా రేషన్ బియ్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలోని 87.59 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో ఒక్కొక్కరికి 12 కేజీల చొప్పున ఉచితంగా అందిస్తామని కేసీఆర్ తెలిపారు.

1,103 కోట్ల రూపాయల విలువైన 3.36 వేల టన్నుల పైచీలకు బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. దీనితో పాటు ప్రతి రేషన్ కార్డుపై రూ.1,500 ఇస్తామని ఇందుకోసం రూ.1,314 కోట్లు ప్రభుత్వానికి అదనంగా ఖర్చు అవుతుందని కేసీఆర్ తెలిపారు. వీలైనంత త్వరలో ప్రజలందరీకి సరకులు అందిస్తామని సీఎం తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ ఉద్యోగాలకు రావాల్సిన అవసరం లేదని 20 శాతం మంది మాత్రం రోటేషన్ పద్ధతిలో హాజరవ్వాలని వెల్లడించారు. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు లేదని వారంతా 100 శాతం హాజరవ్వాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

విద్యాసంస్థలు మూసివేయాలని, అలాగే పరీక్షల ఇన్విజిలేటర్లు కూడా హాజరవ్వాల్సిన అవసరం లేదన్నారు. 1897 చట్టం ప్రకారం లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు విధిగా వారి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రసవానికి దగ్గరవుతున్న గర్బిణీ స్త్రీలను ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు వంటి ప్రజా  రవాణా వ్యవస్థ నిలిచిపోతుందని కేసీఆర్ తెలిపారు. 

అంతర్రాష్ట్ర సర్వీసులు, సరిహద్దులు మూసివేస్తున్నామని... రాష్ట్రంలోకి నిత్యావసర వస్తువులు తీసుకువచ్చే వాహనాలకు మినహాయింపు ఉంటుందన్నారు. వారం రోజులు ఓపిక పట్టి ప్రజలు సంయమనంతో సహకరిస్తే ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చని కేసీఆర్ వెల్లడించారు.

Also  Read:జనతా కర్ఫ్యూ: కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టిన కేసీఆర్

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ఇటలీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అలాంటి దుస్థితి మనకు రావొద్దని కేసీఆర్ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు తమంత తాముగా ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.

తెలంగాణలో 6,000 బృందాలు హోం క్వారంటైన్‌లో ఉన్న వారిపై నిఘా వేసి ఉంచాయని కేసీఆర్ తెలిపారు. ఎవరైనా నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై కఠినచర్య తీసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు.

రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు మూసివేస్తున్నామని... లాక్‌డౌన్ నుంచి మీడియాకు మినహాయింపు వుంటుందని సీఎం తెలిపారు. ఈ వారం రోజులు ప్రతి ఒక్కరిపై నిఘా ఉంటుందని, ఈ విపత్కర సమయంలో మీడియా కూడా సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.