తన స్వగ్రామం సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చదిద్దాలనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే కార్యాచరణను మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిని మరింత వేగవంతం చేశారు.

ఈ నేపధ్యంలో  బుధవారం గ్రామసర్చంచ్ హంసకేతన్ రెడ్డికి కేసీఆర్‌ ఫోన్ చేశారు. ఆత్మీయంగా పలకరించి చింతమడకలో నెలకొన్న సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

ఇంటింటికి వెళ్లి ఎవరికేం కావాలో ఆరా తీయాలని .. నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారు.. వారికి ఎలాంటి ఉపాధి కల్పిస్తే బెటర్ అనే వివరాలను తెలుసుకోవాలన్నారు. వూరిని అభివృద్ధి బాట పట్టిద్దామని.. అన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

అందరం కలిసి ఒకే చోట సహపంక్తి భోజనం చేద్దామని హంసకేతన్‌తో చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కుటుంబసభ్యులతో కలిసి చింతమడకకు వస్తున్నట్లు  కేసీఆర్ తెలిపారు..

‘‘ నీ హయాంలో అభివృద్ధి జరిగితే నీకు పేరొస్తది.. గ్రామంలో పుట్టినందుకు సేవ చేసిన భాగ్యం నాకు దక్కుతుందని ముఖ్యమంత్రి సర్పంచితో అన్నారు. ప్రధానంగా గ్రామంలోని రామాలయం, శివాలయం పనులతో పాటు రాజక్కపేట, రాఘవాపూర్ రోడ్లపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

త్వరలో కేసీఆర్ చింతమడకలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అధికారులతో చర్చించారు.

గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి మాత్రమే చింతమడక వచ్చిన కేసీఆర్.. గ్రామస్తులతో భేటీ కాలేకపోయారు.. ఈ సందర్భంగా త్వరలోనే చింతమడక వస్తానని హామీ ఇచ్చారు.