భారత్- చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన వీర మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని.. ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడం మంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాల్సిందిగా మంత్రి జగదీశ్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.

మరోవైపు సంతోష్ మరణవార్తతో సూర్యాపేటలో ఉంటున్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదం నెలకొంది. అయితే తమ కుమారుడు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందని సంతోష్ తల్లి గర్వంగా చెప్పారు. ఇదే సమయంలో ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు.

తమకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంతోష్ మరణించిన విషయం తెలిసిందని ఆమె వెల్లడించారు. కొద్దిరోజుల్లోనే ఆయన హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా... కరోనా వల్ల రావడం లేటవుతుందని చెప్పాడని సంతోష్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

చివరిసారిగా ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి అమ్మా బాగున్నవా అని అడిగినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. చైనాతో సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్ధితులు ఉన్నాయని తనతో చెప్పాడని, దీంతో జాగ్రత్తగా ఉండాలని తాను చెప్పినట్లు సంతోష్ తల్లి తెలిపారు.