Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు ఇక పీవీ మార్గ్: కేయీలో పీవీ పీఠం

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ గా నామకరణం చేస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ఆ విషయం చెప్పారు.

Telangana CM announces Necklece roaf as PV marg
Author
Hyderabad, First Published Jun 28, 2021, 12:40 PM IST

హైదరాబాద్: ఇక హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు పీవీ మార్గం కానుంది. నెక్లెస్ కు పీవీ మార్గ్ గా నామకరణం చేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. పీవీ తెలంగాణ ఠీవీ అని కేసీఆర్ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగించారు. అంతకు ముందు పీవీ 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళిసైతో కలిసి కేసీఆర్ ఆవిష్కరించారు. 

పీవీ కీర్తిశిఖరం, దీపస్తంభమని కేసీఆర్ అన్నారు. నవోదయ వంటి గురుకుల పాఠశాలలను స్థాపించి వీపీ విద్యావిధానంలో నూతన ఒరవడి సృష్టించారని ఆయన చెప్పారు. పీవీ సాహితీ స్ఫూర్తి అని ఆయన అన్నారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశీలి అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా పీవీ అనేక సంస్కరణలు తెచ్చారని ఆయన చెప్పారు. 

సంస్కరణశీలిగా ప్రపంచానికి పీవీ వెలుగునిచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో భూసంస్కరణలు తెచ్చారని ఆయన అన్నారు. చట్టాన్ని తేవడమే కాకుండా తనకు చెందిన 800 ఎకరాలను పేదలకు పంచి పెట్టారని ఆయన చెప్పారు. పీవీ గొప్ప ఆదర్శవాది అని చెప్పారు. 

వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ చాన్సలర్ తాటికొండ రమేష్ ప్రతిపాదనలు పంపించారని, వాటిని ప్రభుత్వం ఆమోదిస్తుందని ఆయన చెప్పారు. తాటికొండ రమేష్ ముందుకు సాగవచ్చునని ఆయన చెప్పారు.

దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు చేపట్టి గొప్ప పనిచేశారని ఆయన అన్నారు. కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించారని ఆయన కొనియాడారు. 

గవర్నర్ తమిళిసై తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కె. కేశవరావు కూడా ప్రసంగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios