తెలంగాణ ఎన్నికల్లో భాగంగా రేపు జరగబోయే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని రజత్ కుమార్ వెల్లడించారు.

సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఈ రాత్రికల్లా చేరుకుంటారని ఆయన తెలిపారు.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగిందన్నారు. కొత్తగా 20 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారని రజత్ కుమార్ వివరించారు. ఓటరు కార్డు లేని వారు ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

అత్యంత సున్నిత ప్రాంతాలుగా ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని..  మిగిలిన నియోజకవర్గాల్లో 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని రజత్ వెల్లడించారు. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటే ఓటేసే అవకాశం కల్పిస్తామన్నారు.

పోలింగ్ రోజు కూడా ‘‘సీ విజిల్ యాప్’’ వాడొచ్చని ఆయన స్పష్టం చేశారు. బందోబస్తు కోసం కోరినన్ని బలగాలు కేంద్రం నుంచి వచ్చాయన్నారు. ఈవీఎంలు మొరాయిస్తే 30 నిమిషాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తామని రజత్ తెలిపారు.

ఇప్పటి వరకు రూ.135 కోట్లు సీజ్ చేశామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 3,578 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్‌ను ఎన్నికల సంఘం  నేరుగా పర్యవేక్షిస్తుందని సీఈవో స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 26 నుంచి ఓటర్ల జాబితాను మళ్లీ సవరిస్తామని రజత్ తెలిపారు.