హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మంత్రివర్గంపై ఆయన తనయుడు కెటి రామారావు ముద్ర పడే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీ రామారావుకు అనుకూలంగా ఉండే విధంగా మంత్రివర్గ కూర్పు ఉంటుందని భావిస్తున్నారు. 

కేటీఆర్ కు సన్నిహితులైన యువకులకు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రతిగా సీనియర్లను లోకసభకు పోటీ చేయించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తన మేనల్లుడు, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావును కూడా లోకసభకు పోటీ చేయిస్తారని అంటున్నారు. 

లోకసభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో లోకసభ అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కుటుంబ పాలన అనే విమర్శల నుంచి బయటపడడానికి కూడా కేటీఆర్, హరీష్ రావులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడమే మంచిదని కేసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ తనకు తోడునీడగా ఉండేందుకు హరీష్ రావును లోకసభకు పోటీ చేయిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇందులో ఏ మేరకు నిజం ఉందనేది చెప్పలేం గానీ ప్రచారం మాత్రం అలా సాగుతోంది. కేసీఆర్ ఆలోచనలను పసిగట్టడం కూడా కష్టమనే మాట వినిపిస్తోంది. 

ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం 18కి మించకూడదు. ఇప్పటికే మహమూద్ అలీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరో 16 మందికి క్యాబినెట్ లో అవకాశం ఉంటుంది. తొలి విడత ఎనిమిదిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు తొలుత అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. గత మంత్రివర్గంలో పనిచేసిన ఈటెల రాజేందర్, జోగు రామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినపిస్తున్నాయి. 

మాజీ మంత్రులు నాయని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరిలను లోకసభకు పోటీ చేయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.  పోచారం శ్రీనివాస రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ పేర్లు స్పీకర్ పదవి కోసం వినిపిస్తున్నాయి. 

రేఖా నాయక్ ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని అంటున్నారు. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే మహిళకు, ఎస్టీకి స్థానం కల్పించినట్లవుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు, దానం నాగేందర్, పువ్వాడ అజయ్ లకు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.