కేంద్ర బడ్జెట్‌ 2021పై ప్రశంసలు కురిపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌ను స్వాగతించిన ఆయన.. దేశ ప్రజల అంచనాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించే విధంగా ఉందన్నారు.

దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా బడ్జెట్ ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అదనంగా మరో కోటి మందికి మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వారా పొగచూరిన మహిళల జీవితాలలో వెలుగులు నింపిన బడ్జెట్‌గా సంజయ్ అభివర్ణించారు.

కరోనాతో నెమ్మదించిన దేశ ఆర్ధిక వ్యవస్థకు మళ్లీ ఉరుకులు పెట్టించే బడ్జెట్, కరోనా తర్వాత ప్రజల్లో భారత ప్రగతిపై విశ్వాసం పెంచేలా ఈ బడ్జెట్ ను రూపొందించారని ఆయన ప్రశంసించారు. కోవిడ్ నేర్పిన పాఠంతో... ఆరోగ్యరంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్‌ అని చెప్పారు.

కరోనాతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతమవుతున్న తరుణంలో భారతదేశం అభివృద్ది దిశగా ముందడుగు వేయడం శుభసూచకమన్నారు. అభివృద్ది చెందిన దేశాలో సైతం ఆర్ధిక పరిస్థితి కుదేలై కొనుగోలు శక్తి పడిపోయిన ఈ పరిస్థితులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే విధంగా అర్ధిక వ్యవస్థను గాడిలోకి తీసుకురావడం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలతోనే సాధ్యం అయ్యిందన్నారు.

అభివృద్దిని, సంక్షేమాన్ని ఈ బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమతూకంలో ఉంచేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయమన్న ఆయన.. మౌళిక రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడం ద్వారా అన్ని రంగాలు దీర్ఘకాలిక అభివృద్ది దిశగా పయనిస్తాయన్నారు.

ఇక, మొట్ట మొదటి సారిగా బడ్జెట్‌ను ఆరు భాగాలుగా విభజించి ప్రతీ రంగానికి ప్రత్యేక నిధులు మరియు విధానపర నిర్ణయాలు ప్రకటించడం ద్వారా 2021-22లో భారత ఆర్ధిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో సందేహం లేదన్నారు.

జీడీపీలో ద్రవ్యలోటును 6.5శాతానికి నియంత్రించడం ద్వారా దేశ ఆర్ధికస్థితి మెరుగవడం ఖాయని.. ఆత్మనిర్భర ప్యాకేజీకి రూ.27.17లక్ష కోట్లు కేటాయించడంతో వైద్య, విద్య, ఉద్యోగ ఉపాధి రంగాలో అభివృద్ది సూచీ ఖచ్చితంగా కనపడుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు.. ఆర్ధికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం చుదువుతున్నంతసేపు స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోవడం భారీ లాభాలు నమోదు కావడం దేశాన్ని ఈబడ్జెట్‌ అన్ని రంగాల్లో అభివృద్దిపథం వైపు తీసుకెళుతుందనేందుకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు బండి సంజయ్. 

కరోనా అనంతరం ప్రజల ఆరోగ్యం మీద మోడీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుందని ఆయన చెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజారోగ్యానికి రూ.2,23,846 కోట్లు కేటాయించడం భారత చరిత్రలోనే తొలిసారని సంజయ్ గుర్తుచేశారు.

పీఎం ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన కింద 64,180 కోట్లు, వ్యాక్సిన్‌ కోసం రూ.35వేల కోట్లు కేటాయించడం, జాతీయ స్థాయిలో 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు ,100 దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయడం నరేంద్రమోడీ దార్శనికతతోనే సాధ్యం అయిందని బండి సంజయ్ ప్రశంసించారు.