ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై బీజేపీ చేసిన పోరాటం ఢిల్లీకి పాకింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెలంగాణ బీజేపీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. 

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఇంటర్ పరీక్షలకు 9 లక్షల మంది హాజరైతే 3 లక్షల మంది ఫెయిల్‌ అయ్యారని తప్పుడు ఫలితాలు వెల్లడించారని ఆ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 

ఇంటర్ ఫలితాల అవకతవకల వల్ల రాష్ట్రంలో 27 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడ్డారని లక్ష్మణ్ ఆరోపించారు. 

ఇకపోతే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అయితే ఆమరణ నిరాహార దీక్షను సైతం చేశారు. అంతేకాదు మృతుల కుటుంబాలను స్వయంగా పరామర్శించారు కూడా.