దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలతో తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ వచ్చింది. కాస్త కష్టపడితే అధికారం అందుకోవడం కష్టమేమి కాదని కమలనాథులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో జరగున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పావులు కదుపుతోంది. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయంలో గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మూడు జిల్లాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థి విజయానికి అంతా కృషి చేయాలని నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నిక కోసం ఇప్పటి వరకు 5 లక్షల 80 వేల మంది ఓట్లు నమోదు చేసుకున్నట్లు వివరించారు.  3 లక్షల వరకు బీజేపీ అనుబంధ సంస్థలే వాటిని నమోదు చేసినట్లు నివేదిక ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ విజయాల కంటే అఖండమైన మెజార్టీ సాధిస్తామని ప్రదీప్ ధీమా వ్యక్తం చేశారు. టీచర్ల, ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రదీప్‌ కుమార్‌ ఆరోపించారు.

వారి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాడుతోందన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి జిల్లా స్థాయి, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయిల్లో కమిటీలను నియమించినట్లు పేర్కొన్నారు.