హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. దేశభక్తి గురించి కేటీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేటీఆర్ వైఖరి చూసి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారంటూ సెటైర్లు వేశారు. సర్ధార్ పటేల్ ని గౌరవించని మీరు దేశభక్తి గురించి ఎలా మాట్లాడతారంటూ నిలదీశారు. దేశద్రోహి పార్టీ ఎంఐఎంతో అంటకాగుతూ మా దేశభక్తి గురించి ప్రశ్నిస్తారా అంటూమండి పడ్డారు. 

యావత్ తెలంగాణ ఆశ్చర్యపడేలా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. నిజమైన దేశభక్తి అంటే బీజేపీదేనని, నిజమైన దేశభక్తికలిగిన వారు బీజేపీ కార్యకర్తలంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్. 

ఇకపోతే దేశభక్తిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వికాససమితి మూడవ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న కేటీఆర్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహాత్మగాంధీజీని హత్యచేసిన నాథూరామ్‌ గాడ్సేను దేశ భక్తుడు అంటూ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తాను సోషల్‌ మీడియాలో ఖండించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.   ట్విట్టర్ లో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తే తనపైనే కామెంట్స్ రావడం బాధ కలిగించిందన్నారు. నాథూరామ్ గాడ్సేను దేవుడు అన్న ఆమెకు మద్దతు పలకడం బాధకలిగించిందన్నారు.  జాతిపితను గౌరవించుకోలేని జాతి మనది అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
 

ఈ వార్తలు కూడా చదవండి

నాపై కామెంట్సా...?: దేశభక్తిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు