హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై తెలంగాణ సీఎం కేసీఆర్ వేటు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ డా.కె.లక్ష్మణ్. ఉద్యోగులను ఏకపక్షంగా తొలగించడంపై మండిపడ్డారు. 

ప్రభుత్వం హెచ్చరించిన ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె పాల్గొనడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ హెచ్చరికలను లెక్కచేయకుండా సమ్మెలో పాల్గొన్న వారందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. 

కేసీఆర్ నిర్ణయంపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయం ఉద్యోగులను రెచ్చగొట్టేలా ఉందని హెచ్చరించారు. ఏ  కారణం లేకుండా ఉద్యోగులను ఏకపక్షంగా ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. ఉద్యోగులను తొలగించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. 

కేసీఆర్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తే అవి నిలబడవన్నారు. వాస్తవానికి అలాంటి నిర్ణయాలు ఎప్పటికీ అమలు కావని చెప్పుకొచ్చారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమన్న విషయాన్ని కేసీఆర్ మరచిపోయినట్లున్నారంటూ సెటైర్లు వేశారు. 

వేలాది మంది ఉద్యోగులపై రాత్రికి రాత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సమ్మె పై బీజేపీ మొదటి నుండి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉందన్నారు. 
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న ఆర్టీసీ కార్మికులపై అణిచివేత ధోరణి అవలంభించడం సరికాదన్నారు. 

ఆర్టీసీ ఉద్యోగులను తొలగించాలన్న సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు పండుగ రోజున రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడినందుకు రాష్ట్రంలోని ఉద్యోగులకు కెసిఆర్ ఇచ్చే బహుమతి ఇదా అంటూ నిలదీశారు. 

ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు సీఎం కేసీఆర్ ఆర్టీసీ జేఏసీ నేతలను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు సీఎం కేసీఆర్ ఆర్టీసీ జేఏసీ నాయకులను ఒక్కసారి కూడా ఎందుకు కలవలేదని నిలదీశారు. 

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించకుండా కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగించాలనేది, సీఎం కేసీఆర్ అనాలోచన నిర్ణయంగా బీజేపీ భావిస్తుందని స్పష్టం చేశారు.

ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంనటే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని బీజేపీ చీఫ్ డా. కె.లక్ష్మణ్ హెచ్చరించారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యం లో సరికాదన్నారు.