తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆర్డీఎస్‌ను ఆధునీకరించే అవకాశం వున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబుతో కుమ్మక్కై కృష్ణా జిలాల్లో 295 టీఎంసీలకు అంగీకరించారని బండి సంజయ్ ఆరోపించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై పాలమూరు ప్రజలకు కసి వుందన్నారు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay). ప్రజా సంగ్రామ యాత్రలో (praja sangrama yatra) భాగంగా గురువారం మహబూబ్‌నగర్‌లో (mahabubnagar) భారీ బహిరంగ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలమూరు ఎడారిలా వుందన్నారు. పాలమూరు ప్రజలను కేసీఆర్ పగబట్టారంటూ ఆయన దుయ్యబట్టారు. ఆర్డీఎస్ దర్గర కుర్చీ వేసుకుని కూర్చుంటానని సీఎం అన్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ (kcr) ఆర్డీఎస్‌ను ఎందుకు ఆధునీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. పాలమూరును సస్యశ్యామలం చేసే అవకాశం వున్నా చేయడం లేదని బండి సంజయ్ ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు చేయమంటే సీఎం కొనలేదని ఆయన మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల వాటా రావాల్సి వుందని.. కానీ కేసీఆర్ చంద్రబాబుతో (chandrababu naidu) కుమ్మక్కై 295 టీఎంసీలకు అంగీకరించారని బండి సంజయ్ ఆరోపించారు. పాలమూరులో ఇప్పటికీ వలసలు అలాగే వున్నాయని.. వలసలు లేవని చెబితే ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు వస్తున్నాడని బండి సంజయ్ ప్రశ్నించారు. 1400 మంది చనిపోవడానికి రాహుల్ గాంధీయే కారణమని ఆయన దుయ్యబట్టారు.
అంతకుముందు బీజేపీ పదాధికారులతో జరిగిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ (trs) , కాంగ్రెస్ (congress) ఒక్కటేనన్నారు . తెలంగాణలో రాహుల్ (rahul gandhi) పర్యటనకు వచ్చి ఏం సాధిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రతో తెలంగాణలో రాజకీయం మారిందని సంజయ్ పేర్కొన్నారు. ఐదు జిల్లాల మీదుగా రెండో విడత పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. నిరుద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై చాలా మంది ఫిర్యాదులు చేశారని బండి సంజయ్ వెల్లడించారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పి నేతలు పత్తా లేకుండా పోయారని ఆయన దుయ్యబట్టారు.
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కసిగా ఉన్నారని.. ఇతర ప్రాంతాల నుంచి పాదయాత్రకు జనాలను రప్పించలేదన్న బండి సంజయ్ తెలిపారు. ఎక్కడి వారు అక్కడే పాదయాత్రలో పాల్గొనే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. తమకు వచ్చిన విజ్ఞాపన పత్రాలను ప్రభుత్వానికి పంపామని బండి సంజయ్ చెప్పారు. ఆర్‌డీఎస్ సమస్యను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ పాటిల్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని.. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.
ఇకపోతే.. బండి సంజయ్ ఏప్రిల్ 14న తన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఉద్యోగాలు, సాగునీరు, రైతులకు రుణ మాఫీ, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు.
