బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటే బీఆర్ఎస్‌గా ఎందుకు మార్చారని ఆయన నిలదీశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కేటీఆర్ రోజుకో మంత్రి అవతారం ఎత్తుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ 30 లక్షల మంది భవిష్యత్‌ను నాశనం చేశారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు ఉద్యమం ఆపొద్దని.. బీజేపీ అండగా వుంటుందని ఆయన భరోసా కల్పించారు. పంచాయతీ కార్యదర్శులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చూస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఏం పాపం చేశారని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు ధనవంతులు అవుతుంటే.. ప్రజలు బికారీలు అవుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని సంజయ్ ప్రశ్నించారు. మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటే బీఆర్ఎస్‌గా ఎందుకు మార్చారని ఆయన నిలదీశారు. మోడీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలకు పరీక్షలు పెట్టినా ఏక్కడా స్కాం జరగలేదని బండి సంజయ్ గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి దోచుకోవడం , దాచుకోవడమే పని అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం 1400 కుటుంబాలు త్యాగం చేస్తే ఒక్క కుటుంబమే ఏలుతోందన్నారు.
