సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ముఖ్యమంత్రి  రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (bandi sanjay). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం రాష్ట్రానికి శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇతరులు నాశనం కావాలని కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి వున్నాడో లేదో రాష్ట్ర ప్రజలకు తెలియదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని.. రోహింగ్యాలకు షెల్టర్ ఇవ్వడం తప్ప, చేసేదేమీ లేదన్నారు. 

అంతకుముందు నిన్న మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ ముగ్గురు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు . సభ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రీ ప్లాన్ ప్రకారమే తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. 

కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే హరీష్ రావు (harish rao) బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బీజేపీ సభ్యులు (bjp) వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు తన ప్రసంగానికి స్వల్ప విరామం ఇచ్చారు. 

బీజేపీ సభ్యులు రఘునందన్ రావు (raghunandan rao) , రాజాసింగ్ (raja singh), ఈటల రాజేందర్‌లను (etela rajender) ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఇందుకు స్పీకర్ పోచారం ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం హరీష్ రావు సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు అసెంబ్లీ గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ నుంచి బైటికి వచ్చి.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటిసారి అసెంబ్లీకి వెడుతున్న ఈటెల రాజేందర్ ముందుగా.. టాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు.