సారాంశం
నిజామాబాద్ లో జరిగిన ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎదురెదురుపడ్డారు. దీంతో ఇద్దరు నేతలు నవ్వుతూ మాట్లాడుకున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోన్న బీజేపీ.. సీఎం కేసీఆర్‌ను , ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది. హరీశ్ రావు, కేటీఆర్, కవితలపై కాషాయ నేతలు నిత్యం విరుచుకుపడుతూ వుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎదురెదురుపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య నూతన గృహ ప్రవేశానికి వీరిద్దరూ హాజరయ్యారు. అక్కడ ఎదురుపడటంతో ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయాలను పక్కనబెట్టి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్‌కు నిజామాబాద్ జిల్లా నేతలను పరిచయం చేశారు కవిత. అటు బండి సంజయ్ కూడా తమ నేతలను కవితకు పరిచయం చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు కెమెరాలకు పనిచెప్పారు.