ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అమలు కాలేదన్నారు.

అయితే ప్రభుత్వం రోజుకొక ఉత్తరం రాస్తూ తన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక సహాయ నిరాకరణ వల్లే ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఆయన అన్నారు.

రైల్వే, ఎంఎంటీఎస్, రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసినట్లయితే ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి కేంద్రం సిద్ధంగా వుండేదన్నారు బండి సంజయ్. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్ట్ రాలేదని కాగ్ నివేదికలో స్పష్టంగా వెల్లడైందని బండి సంజయ్ గుర్తుచేశారు.

ఐటీఐఆర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం .. పాలనాపరమైన అడుగులు ముందుకు వేయని మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.