తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ... రేవంత్ సర్కార్ కు అగ్నిపరీక్షే..?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది. ఈ సమయంలో సమావేశాల నిర్వహణ ప్రభుత్వానికి అగ్నిపరీక్షే అని చెప్పాలి. ఎందుకంటే...
Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ నెల అంటే జూలై 24 న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధికారులతో చర్చించారు. ప్రభుత్వ విప్ లతో పాటు అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డిజిపి, మరికొందరు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తేదీని నిర్ణయించి ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు స్పీకర్ ప్రసాద్.
వారం రోజులపాటు సమావేశాలు :
తెలంగాణ బడ్జెట్ సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ నెల 24న సమావేశాలు ప్రారంభంకాగా 25 లేదా 26న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా ఆ తర్వాతి రోజునుండే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటం విశేషం.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ఆర్ధిక సంవత్సరం ముగియడానికి ముందే పూర్తిస్థాయి బడ్జెట్ 2024-2025 ను ప్రవేశపెట్టలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. గత ఫిబ్రవరిలో సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ కేవలం నాలుగు నెలల కాలానికే ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టింది. ఆ సమయం పూర్తవడంతో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది.
వాడీ వేడిగా సాగనున్న సమావేశాలు :
తెలంగాణలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిఎస్సి వాయిదా వేయాలని, 25 వేల పోస్టులతో మెగా డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్లను పట్టించుకోకుండా డిఎస్సి నిర్వహణకు సిద్దమవుతుండటంతో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ ఆందోళనలతో రణరంగంగా మారింది. ఇలా ఉద్యమిస్తున్న నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వుంది. ఈ నిరుద్యోగ ఆందోళనలు,ఉద్యోగ నియామకాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం వుంది.
మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని... ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒకచోట హత్యలు, నేరాలు జరుగుతున్నాయని... హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణంగా వుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో లా ఆండ్ ఆర్డర్ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నింటిని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే రూ.2 లక్షలలోపు రైతుల వ్యవసాయ రుణాలు మాపీ చేస్తామని, రైతు భరోసా పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు చాలా హామీలు అమలుకు నోచుకోలేదు...దీనిపై ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. అసెంబ్లీ సమావేశాల్లోనూ రేవంత్ సర్కార్ కు ఈ హామీలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.
మరోవైపు పలువరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ పిరాయింపులను రేవంత్ సర్కార్ ప్రోత్సహిస్తోందని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపైనా అసెంబ్లీలో బిఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాడివేడి వాదన జరిగే అవకాశాలున్నాయి.
ఇదిలావుంటే రేవంత్ సర్కార్ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాదు పలు కీలక బిల్లులను కూడా ఆమోదింపజేసుకునే అవకాశాలున్నాయి. కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై చర్చించనున్నారు. మొత్తంగా ప్రతిపక్షాల దాడి... అధికార పక్షం ఎదురుదాడి మధ్య బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగేలా కనిపిస్తోంది.