హైదరాబాద్: రాష్ట్రంలోని 26 సీట్లలో తమ పార్టీకి కష్టంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వం గుర్తించింది. దీంతో ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆ 26 సీట్లలో ప్రచారం కోసం హరీష్ రావుకు హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రచారం కోసం టీఆర్ఎస్ లో హెలికాప్టర్ ను కేసీఆర్ మాత్రమే వాడుతూ వచ్చారు. ఇప్పుడు హరీష్ రావు దాన్ని వినియోగించనున్నారు.

ప్రజకూటమికి, టీఆర్ఎస్ కు మధ్య హోరాహోరీ పోటీ ఉన్న నియోజకవర్గాలను గుర్తించి, అక్కడికి హరీష్ రావును పంపిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో హరీష్ రావు రోడ్డు షోలు నిర్వహిస్తారు. శనివారంనాడు నిజామాబాద్, వరంగల్, నల్లొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, సదాశివనగర్ ల్లో, డోర్నకల్, వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ ల్లో ఆయన పర్యటిస్తారు. నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో కూడా హరీష్ రావు ప్రచారం సాగిస్తారు. 

ఆదివారంనాడు హరీష్ రావు కరీంనగర్, మానకొండూరు, పటాన్ చెరు, రాజేంద్ర నగర్ శాసనసభా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.