హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరా అన్నదానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. నువ్వా నేనా అన్న రేసులో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే తెరవెనుక లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డివైపే అధిష్టానం మెుగ్గుచూపుతోంది. 

అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాకూటమికి ఆది నుంచి పెద్దన్న పాత్ర పోషించింది ఆయనే. అంతేకాదు కాంగ్రెస్ గెలుపు, ఓటములను సవాల్ గా తీసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డే సరైన సీఎం అభ్యర్థి అంటూ ఏఐసీసీ భావిస్తోంది.  

ఒకవేళ ప్రజాకూటమి ఓడిపోతే గాంధీభవన్ కు రానని సవాల్ కూడా విసిరారు. అంతేకాదు కాంగ్రెస్ ఓడిపోతే గడ్డం తియ్యనని కూడా ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పీసీసీ రథసారథి ఉత్తమ్ కుమార్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.   

ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కూటమి తరపున సీఎం అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డేనని ప్రచారం జరుగుతుంది. అయితే సోమవారం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలవడం, మంతనాలు జరపడం అందులో భాగమేనని ప్రచారం.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చెయ్యాలని ఆదేశించింది. సాయంత్రం 5 గంటల లోపు నూతన సీఎల్పీ లీడర్ ను ఎన్నుకోవాలని ఆదేశించింది. 

సీఎల్పీ లీడర్ ఎన్నికకు సంబంధించి ఏఐసీసీ పరిశీలకులను కూడా పంపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కుంతియా సోమవారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. 

కుంతియాతోపాటు మాజీ కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేర్గాంచిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ లు సీఎల్పీ అభ్యర్థుల ఎంపిక, తెలంగాణలో వచ్చే ఫలితాలపై ఎప్పటికప్పుడు అంచనాలు వేయనున్నారు. 

కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు తెలంగాణ పీసీసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రకటన అనంతరం గెలిచిన అభ్యర్థులంతా అందుబాటులో ఉండాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచారం అందజేశారు. ఐదుగంటలకు స్టార్ హోటల్ లో సీఎల్పీ అభ్యర్థి ఎన్నుకోనున్నట్లు తెలిపారు. 

ప్రజాకూటమి అత్యధిక స్థానాలు గెలిచి అధికారాన్ని ఏర్పాటు చేస్తే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డే సీఎం అభ్యర్థి అని రాహుల్ గాంధీ తనతో చెప్పినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పుకొచ్చారు. 

ఒకవేళ హంగ్ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను ముఖ్యంగా నూతన అభ్యర్థులను అందుబాటులోకి తీసుకోవాలని వారిని అవసరమైతే తమ ఆధీనంలోనే ఉంచుకోవాలని టీపీసీసీకి అధిష్టానం ఆదేశించింది. టీఆర్ఎస్ రచిస్తున్న వ్యూహాలకు అనుగుణంగా పావులు కదపాలని ఆదేశించింది. 

అలాగే కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులను సైతం బుజ్జించే ప్రయత్నాలు చెయ్యాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెబెల్స్ తో పీసీసీ టచ్ లోకి వెళ్లింది. పలువురు స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీ మద్దతుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.