హైదరాబాద్: తన ఆరు ఎకరాల వ్యవసాయభూమిని కొందరు ఆక్రమించుకొన్నారని... అంతేకాదు తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని ఓ ఆర్మీ జవాన్  వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్ గా ఎస్. జవాన్ పనిచేస్తున్నాడు. అతని స్వంత జిల్లా కామారెడ్డి జిల్లా. దేశంలో ప్రతి ఒక్కరూ జై జవాన్, జై కిసాన్ అంటారని  కానీ దేశంలో సైనికులు... రైతుల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆ వీడియోలో ఆరోపించారు. తనకు కూడ ఇదే జరిగిందని ఆయన చెప్పారు.

ఈ విషయమై తమ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా కూడ రెవిన్యూ అధికారుల నుండి స్పందన లేదన్నారు.   ఈ వీడియోను తెలంగాణ సీఎం కేసీఆర్ కు చేరేలా షేర్ చేయాలని  ఆయన కోరారు.  

 

 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం నాడు కామారెడ్డి కలెక్టర్  ఎన్ సత్యనారాయణ స్పందించారు.ఈ విషయమై తనతో జవాన్ గత మాసంలో మాట్లాడారని.. ఆ సమయంలోనే చర్యలు తీసుకోవాలని  రెవిన్యూ అధికారులను ఆదేశించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

అయితే అధికారుల విచారణలో ఈ భూమి వివాదంలో ఉందని  గుర్తించారు. ఇదే విషయాన్ని రెవిన్యూ అధికారులు జవాన్ తండ్రికి సమాచారం ఇచ్చారు.  అంతేకాదు ఈ విషయమై సివిల్ కోర్టును ఆశ్రయించాలని రెవిన్యూ అధికారులు సూచించారు.

ఆర్మీ జవాన్ తండ్రికి, మరో వ్యక్తికి మధ్య ఈ భూమి యాజమాన్య హక్కు విషయమై గొడవలు ఉన్నాయని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై జవాన్ తండ్రి 2016లో కోర్టులో కేసు కూడ దాకలు చేశారు.