హైదరాబాద్: ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలన్న అంశంపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో భవిష్యత్ లో కలిసిపనిచేయాలని మంత్రి వర్గ సమావేశం తీర్మానించిందని స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కర్ణాటక, మహారాష్ట్రలతో గొడవలు ఉండేవన్నారు. బస్తీమే సవాల్ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో గతంలో బేధాభిప్రాయలు ఉండేవన్నారు. 

అయితే వైయస్ జగన్ సీఎంగా ఎన్నికైన తర్వాత జగన్ సహకారం బాగుందన్నారు. సహృదయంతో ముందుకు కలిసిపోతున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటున్నట్లు తెలిపారు. 

కర్ణాటక రాష్ట్రంతో సఖ్యతగా ఉండటం వల్ల ఆర్డీఎస్ ద్వారా 3 టీఎంసీలకు నీరు తెచ్చుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందన్నారు. 

ఆఖరి నిమిషంలో ప్రాజెక్టకు అవసరమైన 15 ఎకరాల భూమిని కూడా అప్పగించడంతోపాటు పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చిందన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు 45లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందించనుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు స్పష్టం చేశామని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్ర సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక వినియోగానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈనెల 27న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తోపాటు ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరై ఇరిగేషన్ కు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలిపారు. 

పాత ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అయినా తెలుగు ప్రజానీకానికి గోదావరి, కృష్ణానీరు కలిపి మెుత్తం 2300 టీఎంసీల నీరు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందన్నారు. 50 సంవత్సరాల సీడబ్ల్యూసీ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే ప్రతీ ఏడాది 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతుందన్నారు. 

రాష్ట్రానికి అందుబాటులో ఉన్న దాదాపు 5వేల టీఎంసీల నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రతీ అంగుళానికి తీసుకెళ్లాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులం నిర్ణయించుకున్నామని తెలిపారు. 

రాష్ట్ర విభజన అంశాలు, భవనాల అప్పగింత, రవాణా ఒప్పందాలు, మోటార్ వెహికల్ ఒప్పందాలు, శాంతి భద్రతల విషయంలో ఇరు రాష్ట్రాలు సఖ్యతతో కలిసిపని చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. గతంలో కీచులాటలు వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు నష్టపోయారని స్పష్టం చేశారు. 

ఇకపై ఎలాంటి కీచులాటలు, గొడవలు ఉండవన్నారు. ఏపీలో ప్రభుత్వం మారడం వల్ల సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు హేండ్ ఓవర్ చేసే అంశం దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. రెండు భవనాల పంపకాలు పూర్తికావడం వల్ల కొత్తగా సెక్రటేరియట్, అసెంబ్లీలు నిర్మించాలని చూస్తున్నట్లు తెలిపారు.