హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శాఖలు కేటాయించారు. తొలుత ప్రమాణ స్వీకారం చేసిన ఇంద్రకరణ్ రెడ్డికి న్యాయం, అటవీ, దేవాదాయ ధర్మదాయశాఖ కేటాయించారు. 

ఇకపోతే ఈటల రాజేందర్ కు కీలకమైన శాఖలు కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖను ఈటల రాజేందర్ దక్కించుకున్నారు. గతంలో ఈయన కీలకమైన ఆర్థిక శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇకపోతే లక్ష్మారెడ్డి వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు మరోమంత్రి చామకూర మల్లారెడ్డికి కార్మిక శాఖ కేటాయించారు. అటు మరోమంత్రి జగదీశ్ రెడ్డికి విద్యాశాఖ కేటాయించారు. గతంలో కూడా జగదీష్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇకపోతే కొప్పుల ఈశ్వర్ కు సంక్షేమ శాఖ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పశు సంవర్థక శాఖ కేటాయించారు. తలసాని గతంలో కూడా ఇదే శాఖను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మరో కీలకమైన శాఖ వ్యవశాయ శాఖను కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు అయిన నిరంజన్ రెడ్డికి కేటాయించారు. 

మరోవైపు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు అయిన వేముల ప్రశాంత్ రెడ్డికి రవాణా, రోడ్లు భవనాలశాఖను కేటాయించారు. గతంలో ఈశాఖలను మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు నిర్వర్తించారు. 

అటు శ్రీనివాస్ గౌడ్ కు ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు,పర్యాటక శాఖ కేటాయించారు. మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన మరోమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కీలకమైన పంచాయితీరాజ్ శాఖ కట్టబెట్టారు. 

ఇకపోతే కీలకమైన ఆర్థికశాఖ, ఇరిగేషన్, ఐటీ, రెవెన్యూ, పట్టణాభివృద్ధి శాఖలను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ చూసిన శాఖలన్నింటీని కేటీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. అటు మేనల్లుడు హరీశ్ రావు చూసిన ఇరిగేషన్ శాఖను కూడా కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. ఈ శాకలను ఎవరికీ కేటయించలేదు.