న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికీ పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్తుండగా తాజాగా మరో మహిళా నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. 

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి రేవతి చౌదరి తెలుగుదేశం పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన రేవతి చౌదరి పార్టీలో చేరే అంశంపై చర్చించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన రేవతి చౌదరి త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈనెల 18న తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ రోజు ఆమె కాషాయి కండువా కప్పుకోనున్నారు. 

ఇకపోతే నటి రేవతి చౌదరి 2018లో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతేకాదు ఆమెకు టీడీపీ అధికార ప్రతినిధిగా అవకాశం కూడా ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.