కేసీఆర్ అన్ని మాయమాటలు చెప్పి.. పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.  బుధవారం ఖమ్మంలో వేదికగా.. ఏపీసీఎం చంద్రబాబు-కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు-రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

రాహుల్-చంద్రబాబు ఒకే వేదిక పంచుకోవడం చారిత్రక ఘట్టమని నామా నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఖమ్మం ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలంతా రాహుల్- చంద్రబాబు ద్వయానికి నీరాజనం పలికారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నారంటూ కేసీఆర్ చెప్పేవన్నీ మాయమాటలేనని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు చంద్రబాబు..రాహుల్ తో జతకట్టారని అన్నారు. కేసీఆర్ కి ఓటు వేస్తే.. మోదీకి ఓటు వేసినట్లేనని ఆయన అన్నారు. చంద్రబాబుని తెలంగాణలో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని కేసీఆర్ అనడం సిగ్గుచేటు అన్నారు.

‘‘హైదరాబాద్ కి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తెచ్చిన ఘనత చంద్రబాబుది. అలాంటి వ్యక్తిని అడ్డుకోవాలా? హైదరాబాద్ కు ఐటీ తీసుకువచ్చినందుకు అడ్డుకోవాలా? హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చినందుకు అడ్డుకోవాలా?’’ అంటూ నామా కేసీఆర్ ని ప్రశ్నించారు.