తాను ప్రతిపాదించిన విజన్ 2020 వల్లే ఇప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కనిపిస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన సమయంలో చాలామంది హెచ్చరించారని చంద్రబాబు గుర్తుచేశారు.
విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు నవ్వుకున్నారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆదివారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థ స్నాతకోత్సవానికి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ప్రతిపాదించిన విజన్ 2020 వల్లే ఇప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం 2047 గురించి ఆలోచించాల్సిన అవసరం వుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
తాను 1978లో తొలిసారి ఎమ్మెల్యేనని.. అప్పట్లో ఎమ్మెల్యేలకు జీపు ఇచ్చేవారని చంద్రబాబు గుర్తుచేశారు. వాటిలో ప్రయాణించేటప్పుడు ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు.
ALso Read: చంద్రబాబుకు భారీ షాక్.. కరకట్టపై గెస్ట్‌హౌస్ అటాచ్ చేసిన ఏపీ సర్కార్..
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన సమయంలో చాలామంది హెచ్చరించారని చంద్రబాబు గుర్తుచేశారు. దాని వల్లే తాను అధికారం కూడా కోల్పోయానని ఆయన పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్ల రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చానని.. ఆ ఫలితాలు ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ శంషాబాద్‌లో నిర్మించామని.. ఇందుకోసం తాము 20 ఎయిర్‌పోర్టులను స్వయంగా పరిశీలించానని గుర్తుచేశారు.
అప్పట్లో బిల్‌గేట్స్‌ను కలిసేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని.. తనను కలవడంపై ఆసక్తి లేదంటూ బిల్‌గేట్స్ అంగీకరించలేదన్నారు. తనకు ఇచ్చిన పది నిమిషాల సమయంలోనే బిల్‌గేట్స్‌కు ప్రజంటేషన్ ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఆ రోజు చేసిన కృషి ఫలితంగానే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు వచ్చిందని, సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా వున్నారని ఆయన పేర్కొన్నారు. ఐటీ తర్వాత తాను ఎక్కువగా ఫార్మా రంగంపై దృష్టి సారించానని.. జీనోమ్ వ్యాలీ కోసం అప్పట్లో భారీగా భూములు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.
