హైదరాబాద్‌: కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని గెలుపుకోసం కుటుంబ సభ్యులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాబాయ్ బాలకృష్ణతోపాటు అత్తింటి వారు సుహాసినికి వెన్నంటి ఉన్నారు. అటు సోదరులు జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సైతం తన అక్క గెలుపుకోసం ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు. 

తన సోదరి నామినేషన్ రోజున సోదరులు ఇద్దరూ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. తన సోదరిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాజాగా నందమూరి సుహాసిని గెలుపు కోసం మరోసోదరుడు ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు. 

సుహాసిని చిన్నాన్న తనయుడు సినీనటుడు తారకరత్న తన అక్క సుహాసిని గెలుపుకోసం కృషి చేస్తానని ప్రకటించారు.  తారకరత్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్టీ ప్రచారానికి సిద్ధమౌతున్నారు. సుహాసిని తరఫున ఆయన ప్రచారం చేయనున్నట్టు పార్టీ, కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

 అక్క గెలుపు కోసం కృషి చేస్తాను. అక్క గెలుపే పెదనాన్న హరికృష్ణకు ఘన నివాళి అని తారకరత్న అన్నారు. రాజకీయాల్లో పెదనాన్న లేని లోటును అక్క విజయంతో పూడ్చుతామన్నారు. కార్యకర్తలతో కలిసి భారీ మెజారిటీ కోసం కృషి చేస్తానని తారకరత్న తెలిపారు.