తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ వారు ఈ సమ్మె చేపట్టారు. కాగా... సమ్మెలోకి దిగితే.. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు. అయినా వాటిని పట్టించుకోకుండా కార్మికులు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. కాగా...  ఆర్టీసీలో ఇక మిగిలింది 12 వందల మంది ఉద్యోగులు మాత్రమే అంటూ ఆదివారం కేసీఆర్ చేసిన ప్రకటన కలకలం రేగింది.

ఆయన ప్రకటన ప్రకారం 48వేల మందిని తొలగిస్తున్నట్లు పరోక్షంగా చెప్పడమేనని అర్థమౌతోంది. అయితే... ఇలా మూకుమ్మడిగా ఉద్యోగాలు తొలగిస్తే అది చెల్లుతుందా లేదా అనేది సర్వత్రాచర్చనీయాంశమయ్యింది. న్యాయ నిపుణులు మాత్రం.. అలా కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం సరికాదని చెబుతూన్నారు.

అయితే... అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రకారం అది చట్టబద్ధమేనంటున్నారు. అయితే, 2003లో సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది తమిళనాడు ఉద్యోగులను అప్పటి సీఎం జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది.
 
వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు నిర్దేశించింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదనే న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేవంటున్నాయి. 

‘‘మేము చట్టబద్ధంగా సమ్మె నోటీసులిచ్చాం. మంత్రి ఉన్నా.. చర్చల్లో పాల్గొనలేదు. చట్టాలు మూకుమ్మడి తొలగింపులను అనుమతించవు. మాకు న్యాయం చేయడానికి కోర్టులున్నాయి’’ అని కార్మికులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా.. ఆర్టీసీ కార్మికులు వరసగా మూడో రోజు తమ సమ్మె కొనసాగిస్తున్నారు. కాగా.. సమ్మె విరమించలేదని ప్రభుత్వం కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించింది. దీంతో..తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరహారదీక్షకు తలపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ దీక్ష అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇందిరాపార్క్ వద్దకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని ముందే ప్రకటించారు. ప్రకటించినట్లుగానే కొందరిని ఇప్పటికే అరెస్టు చేశారు.

అయితే...అరెస్టులు జరిగినా తమ దీక్ష మాత్రం కొనసాగుతుందని ఆర్టీసీ జేఎసీ ప్రకటించింది.ఇందిరాపార్క్ వద్ద తాము తలపెట్టిన నిరహారదీక్షకు మద్దతివ్వాలని పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలను ఆర్టీసీ జేఎసీ కోరింది. ఈ మేరకు ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు ఆర్టీసీ జేఎసీకి మద్దతుగా నిలిచాయి.

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్  ఆదివారం నాడు రాత్రి ప్రకటించారు. దీంతో సోమవారం నాడు ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరహారదీక్షకు దిగనున్నారు.ఇందిరా పార్క్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.ఈ పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తామని జేఎసీ ప్రకటించడంతో పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావాన్ని తెలిపాయి. దీంతో ఇందిరాపార్క్ వద్ద దీక్ష ఎలా సాగుతోందనే ఉత్కంఠ నెలకొంది.