హైదరాబాద్‌: తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కీలక పదవి కట్టబెట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో రాష్ట్ర గిరిజన సలహా మండలి చైర్మన్ గా కొప్పుల ఈ శ్వర్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కొప్పుల ఈశ్వర్ చైర్మన్ గా 20 మంది సభ్యులతో సలహా మండలిని ఏర్పాటు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గిరిజన సలహామండలిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సంచాలకులు, రాష్ట్ర గిరిజన సాంస్కృతిక, పరిశోధనా, శిక్షణ సంస్థ సంచాలకులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సభ్యులుగా కొనసాగనున్నారు. 

అధికారులతోపాటు ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, 12 మంది ఎమ్మెల్యేలకు సభ్యులుగా అవకాశం కల్పించనుంది. ఆగష్టు 8 నుంచి గిరిజన సలహామండలి అమల్లోకి రానుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపోతే ఈ గిరిజన సలహామండలి మూడేళ్లపాటు కొనసాగనుంది.