హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది కీలక నేతలను ఈ ఎన్నికల్లో ఓడించే టీఆర్ఎస్  నాయకత్వ ప్లాన్‌ను విజయవంతం చేయడంలో  హరీష్ రావు సక్సెస్ అయ్యారు.

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీష్ రావు ఈ ఎన్నికల్లో  కీలకంగా వ్యవహరించారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన  26 మంది  కీలక నేతలను  అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయగలిగారు.టీఆర్ఎస్ నాయకత్వం ఏ పని అప్పగించినా ఆ పనిని విజయవంతం చేయడంలో హరీష్‌రావు మరోసారి నిరూపించుకొన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన  అగ్రనేతలను ఓడించేందుకుగాను  హరీష్‌రావుకు హెలికాప్టర్‌ను కూడ టీఆర్ఎస్ నాయకత్వం కేటాయించింది. టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత హెలికాప్టర్‌ను ఉపయోగించి ఎన్నికల ప్రచారం నిర్వహించింది హరీష్ రావు మాత్రమే.

రేవంత్ రెడ్డి, డికె అరుణ,పద్మావతి, ఉత్తమ్, జే. గీతారెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఆరేపల్లి మోహన్,  తూర్పు జయప్రకాష్ రెడ్డి, కె.జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి, మక్తల్ లో టీడీపీ నేత దయాకర్ రెడ్డిని ఓడించాలని హరీష్‌రావుకు టీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతను అప్పగించింది.

సంగారెడ్డిలో జగ్గారెడ్డి, హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు.ఈ స్థానాల్లో  టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.తొలుత టీఆర్ఎస్ నాయకత్వం హరీష్‌రావుకు పెద్దగా కీలక బాధ్యతలను అప్పగించలేదు.

ఈ విషయమై టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీంతో హరీష్ రావుకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన నేతలను ఓడించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హరీష్‌రావుకు బాధ్యతలు ఇచ్చారు.

ఈ కీలక బాధ్యతలతో పాటు సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ హరీష్ రావు ప్రచార బాధ్యతలను నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున మాత్రమే కేసీఆర్ గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. 

గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఈ ఎన్నికల్లో  ఎక్కువ మెజారిటీతో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి విజయం సాధించారు.  ఈ ఎన్నికల్లో  తనకు అప్పగించిన బాధ్యతలను  హరీష్ రావు  మరోసారి సమర్థవంతంగా  పూర్తి చేశారు.